: బెంగళూరు - విశాఖకు రూ. 1,199కే టికెట్... బస్ రేటు కన్నా తక్కువకు ఎయిర్ ఆసియా ఆఫర్!
బెంగళూరు నుంచి విశాఖపట్నానికి ఏపీఎస్ ఆర్టీసీ గరుడా సర్వీసులో ఒకవైపు ప్రయాణానికి చార్జి రూ. 1,914. మధ్యాహ్నం 3:30 గంటలకు బయలుదేరే బస్సులో దాదాపు 18 గంటల పాటు ప్రయాణిస్తేనే గమ్యస్థానానికి చేరుతాం. ఈ పరిస్థితుల్లో ఎయిర్ ఆసియా బంపర్ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. బెంగళూరు - విశాఖ మధ్య రూ. 1,199కి (అన్ని పన్నులూ కలుపుకుని) విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. సెప్టెంబర్ 11లోగా కొనుగోలు చేసే టికెట్లపై వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 6 నుంచి అక్టోబర్ 28 మధ్య ప్రయాణం పెట్టుకోవాలని సూచిస్తోంది. ఇక ఇదే సమయంలో గౌహతి - ఇంపాల్ మధ్య రూ. 599కి, బెంగళూరు నుంచి కోచికి రూ. 899కి, గోవాకు రూ. 1,099కి, ఢిల్లీకి రూ. 2,299కి, పుణెకు రూ. 1,299కి టికెట్లను ఆఫర్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఆఫర్ లో భాగంగా ఎన్ని సీట్లను విక్రయించనున్నారన్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. కోచి నుంచి కౌలాలంపూర్ కు రూ. 3,399కే ఒకవైపు టికెట్ ను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది.