: రాష్ట్రపతి నుంచి ఆదేశాలు వచ్చేవరకు రాజీనామా చేయను: అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్
రాజకీయ సంక్షోభం ఏర్పడిన సమయంలో అరుణాచల్ ప్రదేశ్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవా తీసుకున్న నిర్ణయాలు తప్పని పేర్కొంటూ ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో తిరిగి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో గవర్నర్ హోదా నుంచి జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవా తప్పుకోవాలని వస్తోన్న డిమాండ్ పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. తాను రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు. తనను పదవి నుంచి తొలగించాలనుకుంటే రాష్ట్రపతే తొలగించాలని అన్నారు. దీంతో జ్యోతిప్రసాద్ రాజీనామా చేయాలంటూ కేంద్రం ఆయనపై ఒత్తిడి తెస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జ్యోతి ప్రసాద్ ఈ అంశంపై స్పందిస్తూ.. రాష్ట్ర గవర్నర్ పట్ల ఇటువంటి చర్య ఎంతో విచారకరమని అన్నారు. గవర్నర్‌ను ఆ హోదా నుంచి తొలగించాలంటే రాష్ట్రపతి నుంచి ఆదేశాలు జారీ కావాలని వ్యాఖ్యానించారు. ఆరోగ్య సమస్యలు కారణంగా అరుణాచల్ గవర్నర్ పదవి నుంచి జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవా తప్పుకోవాలంటూ కేంద్ర సహాయ మంత్రితోపాటు, హోంశాఖలో సీనియర్ అధికారి ఒకరు ఆయనకు సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై గవర్నర్ ఆఫీసు వర్గాలు స్పందిస్తూ జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవాను రాజీనామా చేయాలని అధికారికంగా ఆదేశాలు రాలేదని స్పష్టం చేశాయి. అయితే గవర్నర్ రాజీనామా చేయాలని కోరుతూ పలువురి నుంచి ఫోన్లు మాత్రం వచ్చాయని చెప్పాయి. ఈ అంశంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి నుంచి ఆదేశాలు వస్తే తప్పా ఆయన రాజీనామా చేయబోరని పేర్కొన్నాయి.