: కేంద్ర జలవనరుల శాఖ కొత్త శకానికి నాంది పలికింది: తెలంగాణ మంత్రి హరీశ్‌రావు
కేంద్ర జలవనరుల శాఖ కొత్త శకానికి నాంది పలికిందని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్ర మంత్రి ఉమాభారతి సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ఈరోజు ఢిల్లీలో ఉమాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... నాబార్డు, రాష్ట్రం, కేంద్రం కలిసి సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి రూ.7 వేల కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు ఆయన చెప్పారు. తాము పంపిన ప్రతిపాదనల్లో రూ.2 వేల కోట్లు గ్రాంటు రూపంలో, మిగతాది నాబార్డు రుణం ఇవ్వాలని కోరినట్లు హరీశ్‌రావు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టుకు రూ.300 కోట్లు విడుదల చేశారని ఆయన అన్నారు. ఈ నెలాఖరుకల్లా మరిన్ని నిధులు వస్తాయని చెప్పారు. కేఆర్బీఎం, అపెక్స్ కమిటీ, ప్రాజెక్టులకు జాతీయ హోదా అంశాలపై ఉమాభారతితో చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి కేంద్ర జలవనరుల శాఖ పరిగణనలోకి తీసుకున్న మొత్తం 99 ప్రాజెక్టుల్లో రాష్ట్రం నుంచి 11 ప్రాజెక్టులు పొందుపరిచారని ఆయన తెలిపారు.