: ఆరంభ కష్టాలు... డిమాండ్ కు తగ్గట్టు సిమ్ లను అందించలేక చతికిలబడ్డ జియో!


మిగతా టెలికం కంపెనీలతో పోలిస్తే, అతి తక్కువ ధరలకు స్మార్ట్ ఫోన్ డేటాను, ఎవరూ ఇంతవరకూ ఇవ్వని విధంగా ఉచిత కాల్స్ ను ఆఫర్ చేసిన రిలయన్స్ జియో, డిమాండ్ కు తగ్గట్టు 4జీ సిమ్ లను సరఫరా చేయడంలో మాత్రం వెనుకబడింది. వినాయకచవితి సందర్భంగా 5వ తేదీ నుంచి జియో సేవలు ప్రారంభం కాగా, రిలయన్స్ డిజిటల్, ఎక్స్ ప్రెస్ మినీ ఔట్ లెట్ల ముందు వేలాది మంది సిమ్ ల కోసం వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. డిసెంబర్ 31 వరకూ ఉచిత మొబైల్ ఇంటర్నెట్ లభిస్తుందన్న విషయమే తమను ఈ స్టోర్ల వద్దకు నడిపించిందని స్మార్ట్ ఫోన్ యూజర్లు చెబుతుండటం గమనార్హం. అయితే, దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సిమ్ కార్డుల కొరత, కష్టపడి సిమ్ తీసుకున్నప్పటికీ, సాంకేతిక కారణాలతో యాక్టివేట్ కాకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ పరిధిలోని స్టోర్లలో కస్టమర్ల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు వారికి టోకెన్లు ఇచ్చి, 15వ తేదీ నాటికి సిమ్ లను అందిస్తామని హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక 4జీ సిమ్ లను పొందిన లక్షలాది మంది ఔత్సాహికులు, వాటిని యాక్టివేట్ చేయించుకునేందుకు ఒక్కసారిగా వెల్లువెత్తడంతో డిజిటల్ వెరిఫికేషన్ నెట్ వర్క్ సైతం స్తంభించిపోయినట్టు తెలుస్తోంది. ఢిల్లీ వంటి కొన్ని ప్రాంతాల్లో జియో సిమ్ ను రూ. 300 నుంచి రూ. 1000కి విక్రయిస్తున్నట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లోనూ సిమ్ ల కొరత కనిపిస్తోంది. ఓ టెల్కో సంస్థ మెగాబైట్ డేటాను 20 నుంచి 21 పైసలకు విక్రయిస్తేనే లాభం లేకుండా కనీస ఆదాయాన్ని పొందుతుంది. ఈ నేపథ్యంలో జియో ప్రస్తుత ధరవిధానంలో 1 ఎంబీ 11 నుంచి 12 పైసలకే లభిస్తుండగా, తరంగాల వేలం నిమిత్తం పెట్టిన పెట్టుబడి సంస్థకు ఆదాయ రూపంలో ఎలా వస్తుందన్నది ఇప్పటికీ జవాబులేని ప్రశ్నే!

  • Loading...

More Telugu News