: జేమ్స్ బాండ్ పాత్ర వద్దని భీష్మించుకున్న క్రెయిగ్ ను ఒప్పించేందుకు సుమారు రూ. 1000 కోట్ల ఆఫర్!
ఇక భవిష్యత్తులో జేమ్స్ బాండ్ పాత్రను వేయబోనని హీరో డానియల్ క్రయిగ్ భీష్మించుకుని కూర్చున్న వేళ, ఇప్పటికిప్పుడు మరో హీరోను వెతికే ఆలోచనలో లేని నిర్మాణ సంస్థ సోనీ, భారీ ఆఫర్ ను అతని ముందుంచినట్టు తెలుస్తోంది. ఏకంగా 150 మిలియన్ డాలర్లు (రూ. 996 కోట్లు) ఇచ్చేందుకు సోనీ నుంచి క్రెయిగ్ కు ఆఫర్ వెళ్లినట్టు 'రాడర్ ఆన్ లైన్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కనీసం మరో రెండు సినిమాల వరకూ డానియల్ నే హీరోగా కొనసాగించాలని నిర్మాతలు భావిస్తుండగా, 'స్పెక్టర్' చిత్రం తరువాత, తానింక బాండ్ సినిమాలు చేయబోనని హీరో ప్రకటించిన సంగతి తెలిసిందే. బాండ్ చేసే స్టంట్స్ కారణంగా తాను గాయాలపాలౌతూ ఇబ్బందులు పడుతున్నట్టు ఆయన తెలిపాడు. ఇక మరోసారి జేమ్స్ బాండ్ 007గా డానియల్ క్రెయిగ్ దర్శనమిస్తాడో, లేదో వేచి చూడాలి.