: ఏపీ క్యాబినెట్ కమిటీ భేటీ వేళ... నేతలందరినీ పిలిపించుకున్న జగన్
అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, జీఎస్టీ బిల్లుకు తొలిరోజే ఆమోదం పలకడం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రెగ్యులేషన్ చట్టానికి సవరణ తదితరాంశాలపై చర్చించేందుకు ఏపీ క్యాబినెట్ భేటీ జరగనున్న వేళ, విపక్ష నేత వైఎస్ జగన్ అధ్యక్షతన వైకాపా నేతలు సమీక్షా సమావేశం జరపాలని నిర్ణయించారు. ఈ ఉదయం 11 గంటలకు లోటస్ పాండ్ లో సమావేశమయ్యే వైకాపా నేతలు, అసెంబ్లీలో చంద్రబాబు సర్కారును ఎలా ఇరుకున పెట్టాలన్న అంశంతో పాటు, త్వరలో జరిగే మునిసిపల్ కార్పొరేషన్ల ఎన్నికలపైనా చర్చించనున్నారు. ఈ సమీక్షా సమావేశానికి ప్రజా ప్రతినిధులతో పాటు వైకాపా జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ పరిశీలకులు, అసెంబ్లీల సమన్వయకర్తలకు కూడా ఆహ్వానం అందింది. ఏపీలో 7 కార్పొరేషన్లకు, 5 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న వేళ, అభ్యర్థులు, ఎన్నికల వ్యూహం తదితరాలపై వీరి మధ్య చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.