: 50 సంవత్సరాలు వెనక'బడి'న ఇండియా!: యునెస్కో నివేదిక
నేటి ప్రపంచం ట్రెండ్ తో పోలిస్తే విద్యారంగంలో లక్ష్యాలను అందుకోవడంలో ఇండియా 50 సంవత్సరాలు వెనకబడి ఉందని యునెస్కో తన తాజా 'గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్' రిపోర్టులో పేర్కొంది. లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రాథమిక విద్యా విధానంలో సమూల మార్పులు రావాల్సి వుందని పేర్కొంది. దక్షిణాసియా దేశాల్లో ప్రాథమిక విద్య విషయంలో 100 శాతం అక్షరాస్యత 2015 నాటికి, మాధ్యమిక విద్యలో 2060, ఉన్నత విద్యలో 2085 నాటికి మాత్రమే లక్ష్యాలను చేరగలిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నామని పేర్కొంది. విద్యారంగంలో లక్ష్యాలను సాధించేందుకు గతంలో 2030 సంవత్సరాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, దానికన్నా సుమారు 50 సంవత్సరాలు ఆలస్యంగా ఇండియా సహా దక్షిణాసియా దేశాలు టార్గెట్ కు దగ్గర కావచ్చని పేర్కొంది. వాతావరణ మార్పుల గురించి అవగాహన విషయంలోనూ విద్యాధిక దేశాలు ముందున్నాయని, ఇండియాలో ప్రస్తుతం 30 కోట్ల మంది విద్యార్థులు పాఠశాల దశలో ఉన్నారని గుర్తు చేస్తూ, వీరందరికీ పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పాఠాలు చెప్పాలని సూచించింది.