: దొంగతో మహిళా ఎస్సై పోరు.. పర్సును రక్షించుకునే క్రమంలో రైలు నుంచి కిందపడిన ఎస్సై
తన పర్సును దొంగిలిస్తున్న ఓ యువకుడి నుంచి దానిని తిరిగి లాక్కునే క్రమంలో ఓ మహిళా ఎస్సై రైలు నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సుమన్ దాగర్ సీఐఎస్ఎఫ్‌లో ఎస్సైగా పనిచేస్తున్నారు. శనివారం ఆమె అజ్మీరు నుంచి జబల్‌పూర్‌కు రైలులో బయలుదేరారు. రుతియాల్ జంక్షన్ వద్ద దాగర్ తన బ్యాగు, ఇతర వస్తువులను తీసుకుని రైలు దిగేందుకు ఎంట్రన్స్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడున్న ఓ వ్యక్తి దాగర్ పర్సును దొంగిలించేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన ఎస్సై అతడి నుంచి దానిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్వల్ప పెనుగులాట జరిగి ఆమె ఒక్కసారిగా రైలు నుంచి కిందపడ్డారు. ఇదే అదునుగా భావించిన దొంగ పర్సుతో పరారయ్యాడు. రైలు నుంచి కిందపడిన దాగర్ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలైనట్టు గుణ జీఆర్పీ స్టేషన్ ఇన్‌చార్జ్ ఆర్వీఎస్ పరిహార్ తెలిపారు. పర్సులో రూ.5 వేల నగదు, మొబైల్ ఫోన్, విలువైన పత్రాలు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దొంగ కోసం గాలిస్తున్నారు.