: ఏపీకి ‘హోదా’ హుళక్కేనా?.. ఉన్న వాటినీ ఎత్తేయాలన్న శివరాజ్‌సింగ్ చౌహాన్ కమిటీ సిఫార్సులు!
విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా దక్కే అవకాశం లేదా? హోదాపై ఏపీ ప్రభుత్వం, ప్రజలు పెట్టుకున్న ఆశలు అడియాసలు కానున్నాయా? మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సులు చూస్తుంటే నిజమేనని అనిపిస్తోంది. కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాల్లోనూ దానిని ఎత్తివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందుకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయాలని భావిస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాల(సీఎస్ఎస్)పై అధ్యయనానికి నీతి ఆయోగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన కేంద్రం సీఎంల సబ్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ గతేడాది అక్టోబరులోనే తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. కమిటీ సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదాను ఎత్తివేయాలని నిర్ణయించింది. హోదాలను ఎత్తివేయాలంటూ సూచించిన కమిటీ రాష్ట్రాల పేర్లను మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. కమిటీ సిఫార్సుల మేరకు హోదాను ఎత్తివేసి ఆ స్థానంలో భారీ ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. నిజానికి కమిటీ తన సిఫార్సుల్లో ఎక్కడా హోదాను రద్దు చేయాలని పేర్కొనలేదు. కానీ దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.