: కేంద్ర ప్రభుత్వం పథకాలపై అధ్యయనానికి చంద్రబాబు ఆదేశం.. లెక్కలు తేల్చాలన్న సీఎం
ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం త్వరలో ప్రకటించనున్నట్టు చెబుతున్న ప్రత్యేక హోదా, ప్యాకేజీపై జోరుగా చర్చ సాగుతోంది. హోదా కోసం ఏపీలో నిరసనలు మొదలు కావడం, ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ గళమెత్తడంతో స్పందించిన బీజేపీ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా ఏదో ఒకటి తేల్చాలని నిర్ణయించుకుంది. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం ఏపీకి చాలా ఇచ్చామని చెబుతుండగా, కేంద్రం మాత్రం హోదాతో ఒనగూరే ప్రయోజనాల కంటే ప్యాకేజీ రూపంలోనే ఎక్కువగా ఇస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందన్న దానిపై ఏపీ ముఖ్యమంత్రి దృష్టిసారించారు. నిజంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న సాయం ఎంత? అనే విషయాన్ని నిగ్గు తేల్చాలని భావించారు. ఈ విషయంలో అధ్యయనం కోసం ఆర్థిక సలహాదారు, ప్రముఖ కాస్ట్ అకౌంటెంట్ కె.నరసింహమూర్తికి బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో అమలవుతున్న కేంద్రప్రభుత్వ పథకాలు, నిధుల కేటాయింపు, అందులో ఏపీ వాటా, కేంద్రం నుంచి ఆయా పథకాలకు రావాల్సిన నిధులు, విడుదలైన మొత్తం.. తదితర అంశాలపై నరసింహమూర్తి అధ్యయనం చేయనున్నారు. ఇందులో భాగంగా 2013లో ప్రారంభమైన కేంద్ర ప్రాయోజిత పథకం ‘రూసా’పై ఆయన ఇప్పటికే అధ్యయనం చేశారు. ఈ పథకానికి సంబంధించిన ప్రజెంటేషన్‌ను సీఎం కార్యాలయానికి సమర్పించారు.