: నేను 'బొమ్మాళి' సరే... 'పశుపతి' మీ నాన్నా?: కవితకు అరుణ ప్రశ్న
తనను అరుంధతి సినిమాలోని 'బొమ్మాళి'గా ఎంపీ కవిత అభివర్ణించడంపై మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. రెండు రోజుల దీక్ష ముగిసిన అనంతరం ఆమె మాట్లాడుతూ, కవిత చెబుతున్నట్టుగా తాను బొమ్మాళినైతే... పశుపతి ఎవరు? మీ నాన్న కేసీఆరా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జిల్లాలు ఏర్పాటు చేయడం సరికాదని, శాస్త్రీయ విధానంలో జిల్లాల ఏర్పాటు జరగాలని ఆమె సూచించారు. అలా కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం, ఇష్టారాజ్యంగా జిల్లాలను ఏర్పాటు చేస్తామనడం సరికాదని ఆమె హితవు పలికారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని జిల్లాలు ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గద్వాలను జిల్లాగా చేయాలని ఆమె తెలిపారు.