: రిలయన్స్ జియో 'ఉచిత' రహస్యమిదే... ఫ్రీ ఏమీ కాదంటున్న నిపుణులు!
"కేవలం డేటాకు లేదా కాల్స్ కు మాత్రమే స్మార్ట్ ఫోన్ వినియోగదారులు డబ్బు చెల్లిస్తే చాలు. కాల్స్ కు డబ్బులు ఇచ్చే విధానం పోవాలి. మా నెట్ వర్క్ లో అన్ని కాల్స్ ఉచితం" అంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ జియో సేవలను గురించి వివరిస్తూ చేసిన ప్రకటన సంచలనానికే తెరతీశారు. ఇక ఈ ఉచిత కాల్స్ పై విశ్లేషించిన నిపుణులు, అదేమీ ఉచితంగా లభించదని, దీని వెనుక రిలయన్స్ జియో పెద్ద ప్లాన్ ఉందని చెబుతున్నారు. అదేంటంటే... రిలయన్స్ జియో సిమ్ 4జీ ఎల్టీఈ విధానంలో పనిచేస్తుందన్న సంగతి తెలిసిందే. కేవలం 4జీ ఫోన్లు తప్ప, మార్కెట్లోని 2జీ, 3జీ ఫోన్లు పనిచేయవు. మామూలుగా ఎయిర్ టెల్, ఐడియా తదితర కంపెనీలు డేటా కోసం 4జీ సిగ్నల్స్ ఇస్తున్నాయి. వాయిస్ కాల్స్ కు సాధారణ సిగ్నల్స్ తో చేసుకుంటుండగా, దానిపై చార్జీలను వసూలు చేస్తున్నాయి. జియో మాత్రం కేవలం 4జీ తరంగాలపై మాత్రమే పనిచేస్తుంది. మొబైల్ డేటాను ఆఫ్ చేస్తే కాల్స్ వెళ్లవు. మొబైల్ డేటా ఆన్ లో ఉంటేనే కాల్స్ చేసుకోగలుగుతాం. వీఓ ఎల్టీఈ సాంకేతికతను జియో వాడుతుండటమే ఇందుకు కారణం. ఈ కాల్స్ ను కూడా జియో తయారు చేసిన యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని దాన్నుంచి మాత్రమే చేసుకోవాలి. ఇక కాల్స్ చేసుకుంటే మొబైల్ డేటా ఖర్చవుతుంది. ఒక నిమిషం కాల్ చేసుకుంటే సుమారు ఒకటిన్నర ఎంబీ వరకూ ఖర్చవుతుంది. దానికి చార్జ్ పడుతుందన్న విషయాన్ని రిలయన్స్ జియో చెప్పలేదు. దీనివల్ల ఉచితంగా కాల్స్ చేసుకుంటున్నామని కస్టమర్లు అనుకుంటారు. కానీ వారి ప్యాకేజీలో భాగంగా ఇచ్చిన డేటాలో ఎంతో కొంత ఈ కాల్స్ రూపంలో ఖర్చవుతుంది. ఇదే రిలయన్స్ జియో 'ఫ్రీ' వెనకున్న రహస్యం. ఇక డేటా అయిపోతే, 1 జీబీని రూ. 50 పెట్టి కొనుక్కోవాలన్న సంగతి తెలిసిందే. ఒకసారి జియోకు ప్రజలు అలవాటు పడేలా చేసి, ఆపై అధిక చార్జీలు వసూలు చేసే ఆలోచనలోనే రిలయన్స్ ఉండి ఉండవచ్చని టెలికం రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.