: కార్పొరేషన్ ఎన్నికలతో రాజకీయ బరిలోకి జనసేన!


ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగుతుందని పవన్ సన్నిహితులు, జనసేన ముఖ్య నేతల నుంచి సంకేతాలు అందుతున్నాయి. 9వ తేదీన కాకినాడ వేదికగా పవన్ నిర్వహించే బహిరంగ సభలో ఇందుకు సంబంధించిన కీలక ప్రకటన ఆయన నోటి వెంటే స్వయంగా వస్తుందని కూడా జనసేన నేతలు చెబుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే ఆయన ముందున్న లక్ష్యమని, హోదా స్థానంలో ప్యాకేజీ అంటే, రాష్ట్ర ప్రజలు అంగీకరించరని భావిస్తున్న ఆయన, ఎన్డీయేతో మిత్రత్వంపై కాకినాడ సభలో స్పష్టత ఇస్తారని వెల్లడిస్తున్నారు. ఈ సభ నిర్వహణపై ఇప్పటికే కాకినాడతో పాటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలువురు సన్నిహితులతో పవన్ ప్రత్యేకంగా చర్చించారని తెలుస్తోంది. దాదాపు 3 లక్షల మంది సభకు వస్తారని భావిస్తున్న పవన్, ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని తన అనుచరులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. తదుపరి బహిరంగ సభ ఎక్కడ జరపాలన్న విషయాన్ని కూడా కాకినాడ సభలో పవన్ స్వయంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. విభజనకు ముందు రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదాపై బీజేపీ వెనకడుగు వేయడంపై కాకినాడ సభలోనూ పవన్ విరుచుకుపడే అవకాశాలే కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News