: ముంబయిలో ‘డెట్టాల్ మహా క్లీనథాన్’.. చీపుర్లు పట్టుకుని రోడ్లు ఊడ్చిన ఫడ్నవిస్, అమితాబ్
వ్యక్తిగత పరిశుభ్రతపై ముంబయిలో నిర్వహించిన 'డెట్టాల్ మహా క్లీనథాన్' కార్యక్రమంలో ఆ కార్యక్రమ అంబాసిడర్, బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌తో కలిసి ఆయన చీపుర్లు పట్టుకొని రోడ్లను ఊడ్చారు. ఈ సందర్భంగా ఫడ్నవిస్ మాట్లాడుతూ... తమ రాష్ట్రంలోని 50 నగరాలను వచ్చే గాంధీ జయంతి నాటికి క్లీన్ సిటీలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే 7000 గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలయ్యాయని ముఖ్యమంత్రి చెప్పారు. పరిశుభ్రత విషయంలో తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకొని ముందుకువెళుతోందని ఆయన అన్నారు. పరిశుభ్రతను పెంచే క్రమంలో ప్రజలు తోడ్పాటునందించాలని పేర్కొన్నారు.