: బెజవాడలో సమ్మె ప్రభావం పాక్షికమే!... యథావిధిగా తిరుగుతున్న ఆర్టీసీ బస్సులు!
నిన్న అర్ధరాత్రి నుంచే దేశవ్యాప్తంగా ప్రారంభమైన సార్వత్రిక సమ్మె ప్రభావం... నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో మాత్రం అంతగా కనిపించడం లేదు. సార్వత్రిక సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీలోని కార్మిక సంఘం ఎంప్లాయీస్ యూనియన్ తో పాటు కార్మిక పరిషత్ మాత్రమే మద్దతు పలికాయి. మెజారిటీ కార్మికులతో ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్న నేషనల్ మజ్దూర్ యూనియన్ మాత్రం సమ్మెకు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్ఎంయూకు చెందిన కార్మికులు నేటి ఉదయం యథావిధిగా విధులకు హాజరయ్యారు. దీంతో నగరంలో ఆర్టీసీ బస్సులు రోజు మాదిరే రోడ్డెక్కాయి. ఇక నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు కూడా తలుపులు తెరచుకున్నాయి. దీంతో నగరంలో సార్వత్రిక సమ్మె ప్రభావం అంతగా కనిపించడం లేదు.