: సింగపూర్‌లో జికా భయం.. 13 మంది భారతీయులకు సోకిన వైరస్
దోమల ద్వారా వ్యాపించే జికా వైరస్ భయం అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాల్లో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. అదే వైరస్ భయం ఇప్పుడు సింగపూర్‌లో కూడా కలకలం రేపుతోంది. సింగపూర్‌లో అనేక మందికి జికా వైరస్ సోకింది. వారిలో భారతీయులు కూడా ఉన్నారు. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. సింగపూర్‌లో మనవాళ్లు 13 మంది ఈ వైరస్ బారిన పడ్డారని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ పేర్కొన్నారు. ఆ దేశంలో కొంతమంది నిర్మాణ కూలీలు కూడా ఈ వైరస్ బారినపడ్డారు. ఆ తరువాత సింగపూర్ వ్యాప్తంగా 115 మంది ఈ వైరస్ బారిన పడ్డారని అక్కడి అధికారులు పేర్కొన్నారు. తాజాగా ఓ గర్భిణిలోనూ ఈ వైరస్ లక్షణాలు కనిపించాయని, దీంతో ఆమెను ప్రత్యేక చికిత్స కోసం తరలించినట్లు తెలిపారు. జికా వైరస్ సోకిన గర్భిణీలకు పుట్టే పిల్లలు సహజంగా శిశువులకు ఉండే తల సైజు కంటే చిన్న తలతో పుడతారు.