: నడిరోడ్డుపై నిరసనకు దిగనున్న జైపూర్ రాజమాత... వందలాదిగా తరలివస్తున్న రాజ్ పుత్ లు


ఒకప్పుడు వారిది రాజకుటుంబం. అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో తులతూగిన వంశం. ఇప్పుడు రాజకుటుంబమన్న పేరు తప్ప ఆస్తులు ఏమీ లేవు. మిగిలిన ఆస్తులను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోగా, రాజమహల్ ప్యాలెస్ నైనా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో జైపూర్ రాజమాత పద్మినీ దేవి (73) స్వయంగా నడిరోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. ఆమెకు మద్దతు తెలుపుతూ వందలాది మంది రాజ్ పుత్ వర్గ నేతలు తరలివస్తున్నారు. జైపూర్ లోని రాజమహల్ ప్యాలెస్ ప్రస్తుతం స్టార్ హోటల్ గా సేవలందిస్తోంది. క్వీన్ ఎలిజబెత్, లార్డ్ మౌంట్ బాటన్, షా ఆఫ్ ఇరాన్ వంటి వారెందరికీ ఇది ఆతిథ్యమిచ్చింది. గత వారంలో ఈ ప్యాలెస్ గేట్లను సీజ్ చేసిన రాజస్థాన్ ప్రభుత్వ వైఖరిని రాజకుటుంబం తీవ్రంగా తప్పుపడుతోంది. "మా నుంచి ఇంకా ఎంత తీసుకుంటారు? మాకు గౌరవం లేదా? ఇది చాలా బాధాకరం. కనీస మానవత్వాన్ని చూపించడం లేదు" అని జైపూర్ రాయల్స్ కుటుంబ పెద్ద పద్మినీ దేవి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జైపూర్ లోని ట్రిపోలియా గేట్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్ మహల్ ప్యాలెస్ వరకూ నడిచి నిరసన తెలపాలని ఆమె నిర్ణయించుకున్నారు. కాగా, ఒకప్పుడు మహారాజా సవాయ్ మాన్ సింగ్ -2 నివాసంగా ఉన్న ఈ భవంతి ఆపై బ్రిటీష్ రెసిడెన్సీగా మారింది. 1949లో సంస్థానాల విలీనం వేళ, తమకు ఇచ్చారని రాజకుటుంబం సాక్ష్యాలు చూపుతోంది. అయితే, 1993లో కోర్టు ఆదేశాల మేరకు మొత్తం స్థలంలో కొంత భాగం ప్రభుత్వ పరమైందని, ఆ భాగాన్ని మాత్రమే తాము స్వాధీనం చేసుకున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News