: నిస్సహాయులై మిగతా జవాన్లు చూస్తున్నవేళ.. సైనికుడికి పునర్జన్మను ప్రసాదించిన గృహిణి
ఆపదలో కూరుకుపోయి ప్రాణాపాయంలో ఉన్న సహచరుడికి సాయం చేయలేక, తోటి సైనికులు నిస్సహాయంగా ఉన్న వేళ.. ఓ గృహిణి జవాను ప్రాణాలు కాపాడింది. క్షణాల్లో నిర్ణయాలు తీసుకున్న ఆమె అతడికి పునర్జన్మను ప్రసాదించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఆగస్టు 20న ఈ ఘటన చోటుచేసుకుంది. అసోం రైఫిల్స్‌కు చెందిన కొందరు జుటోగ్ కాంట్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. గత నెల 20న సిమ్లాకు 20 కిలోమీటర్ల దూరంలోని బానుటి ప్రాంతంలో వీరిని వీధి కుక్కలు వెంబడించాయి. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు జవాన్లు పరుగులు తీశారు. ఈ క్రమంలో ముఖేశ్ కుమార్ అనే జవాను రోడ్డుపక్కనున్న మురికి కాల్వలోకి పడిపోయాడు. పడిపోయే క్రమంలో అతడి తలకు పెద్ద రాయి తగలడంతో స్పృహ కోల్పోయాడు. అతడిలో కదలికలు ఆగిపోయాయి. ఏం చేయాలో పాలుపోని సహచరులు సాయం కోసం చుట్టుపక్కల వారిని అర్థించారు. వారి కంగారును గుర్తించిన వీణాశర్మ(42) అనే గృహిణి వెంటనే అక్కడికి చేరుకుంది. క్షణాల్లోనే పరిస్థితిని అంచనా వేశారు. అప్పటికే అతడు చనిపోయాడని భావించిన సహచరులు నిస్సహాయంగా చూస్తున్నారు. క్షణం కూడా ఆలస్యం చేయని వీణ వెంటనే సైనికుడి నోట్లో నోరు పెట్టి గట్టిగా గాలి ఊదడం ద్వారా అతడిలో కదలిక తేగలిగారు. కారు ఉన్నా సైనికులకు డ్రైవింగ్ తెలియకపోవడంతో వెంటనే తన 72 ఏళ్ల తండ్రి రమేశ్ శర్మకు ఫోన్ చేసి పిలిపించారు. అనంతరం ముఖేశ్‌ను జుటోగ్ మిలటరీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సైనికుడికి పునర్జన్మ ప్రసాదించిన వీణాపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు సైనికుడిని రక్షించిన ఆమెకు అసోం రైఫిల్స్ జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కరించింది.