: హోదా లేదు, రైల్వే జోన్, రాయితీలు మాత్రమే... అంగీకారం తెలిపిన మోదీ?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సెంటిమెంట్ గా మారిన ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం తయారు చేసిన ముసాయిదాలో పొందుపరచలేదని తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా కలిసి ముసాయిదాలోని వివరాలు వెల్లడించి ఆయన అంగీకారాన్ని తీసుకున్నారు. ఇందులో పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీల పరిష్కారం దిశగా మాత్రమే అడుగులు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమైన విశాఖ రైల్వేజోన్ అంశాన్ని మాత్రం ఇందులో చేర్చారని సమాచారం. కేంద్ర సంస్థల ఏర్పాటు, పరిశ్రమలకు రాయితీలు, గ్రాంటు శాతం పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇదే ముసాయిదాలో హోదా ఇవ్వాలని తమకు ఉన్నప్పటికీ, అందుకు అడ్డుపడుతున్న కారణాలను వివరణాత్మకంగా పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలకు మరింత ఆర్థిక సహాయం అంశంతో పాటు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా డిప్రీసియేషన్, అలవెన్స్ లను మరికొంత పెంచుతూ ముసాయిదాలో తమ నిర్ణయాన్ని చేర్చినట్టు సమాచారం. కడపలో స్టీల్ ప్లాంట్, విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖతో పాటు విజయవాడ - తెనాలి - గుంటూరులను కలుపుతూ మెట్రో రైల్, చెన్నై - విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి తదితర అంశాలనూ జోడించిన కేంద్రం, ఏపీకి మాత్రమే వర్తించేలా గ్రాంట్ శాతాన్ని పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజధాని మౌలిక అవసరాలను తీర్చేందుకు రూ. 4 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ తదితరాంశాలు ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News