: భారత్‌లో పెట్టుబడులు పెట్టండి.. శాశ్వత నివాసం పొందండి: విదేశీ ఇన్వెస్టర్లకు బంపరాఫర్


పెట్టుబడులకు భారత్‌ను గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న కేంద్రం విదేశీ ఇన్వెస్టర్లకు భారీ తాయిలాలు ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మేరకు విదేశీయులకు బంపరాఫర్ ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. భారత్‌లో పెట్టుబడులు పెట్టే విదేశీయులకు ఇక్కడ పదేళ్లపాటు శాశ్వత నివాసం కల్పిస్తారు. అదే కనుక అమలైతే అమెరికా, కెనడా, బ్రిటన్ సరసన భారత్ కూడా చేరుతుంది. అమెరికా ఈబీ-5 వీసా పేరుతో ఈ విధమైన వీసాలు జారీ చేస్తోంది. వీటిని అందుకున్న వారిలో ఇండియా, చైనా మిలియనీర్లు అధికంగా ఉన్నారు. ఇండియాలో 18 నెలల కాలవ్యవధిలో రూ.10 కోట్లు, మూడేళ్ల కాలవ్యవధిలో రూ.25 కోట్లు పెట్టుబడులు పెట్టేవారికి శాశ్వత నివాసం కల్పించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ పదేళ్లలో ఇన్వెస్టర్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతికూల నోటీస్ అందుకోకుంటే నివాస వ్యవధిని మరో పదేళ్లు పొడిగిస్తారు. ఇందుకోసం ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఈ పదేళ్ల కాలవ్యవధిలో పెట్టుబడిదారులు ఇండియాలో ఆస్తులను కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే వారి భాగస్వామి ఇండియాలో ఉద్యోగం చేసుకోవడానికి, పిల్లలు చదువుకోవడానికి అనుమతిస్తారు. అయితే ఈ స్కీం పాకిస్థాన్, చైనీయులకు మాత్రం వర్తించదు.

  • Loading...

More Telugu News