: ఎన్నడూ లేనంతగా హైదరాబాద్ అస్తవ్యస్తమైంది, ప్రయాణాలు పెట్టుకోవద్దు: మంత్రి కేటీఆర్
వర్షాలకు గతంలో ఎన్నడూ లేనంతగా నగరం అస్తవ్యస్తమైందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో భారీ వర్షం సృష్టించిన బీభత్సం గురించిన వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... శిథిల భవనాల కూల్చివేత పనులను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిందని గుర్తు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వర్షాల కారణంగా ఈరోజు మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అధికారులందరిని అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. వాతావరణ శాఖ రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపిందని ఆయన చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు. రోడ్లపై నీళ్ల నియంత్రణ, ట్రాఫిక్ సమస్యను ఇప్పటికే చాలా వరకు పరిష్కరించినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు.