: రూ. 2,600 కోట్లతో టెన్ స్పోర్ట్స్ ను కొనుగోలు చేసిన సోనీ
జీ ఎంటర్ టెయిన్ మెంట్ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ (జడ్ఈఈఎల్) నేతృత్వంలో నడుస్తున్న ప్రముఖ స్పోర్ట్స్ చానల్ టెన్ స్పోర్ట్స్ ను సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా (ఎస్పీఎన్) 385 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 2,600 కోట్లు) కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు తరువాత సుభాష్ చంద్ర నడుపుతున్న జీ ఎంటర్ టెయిన్ మెంట్ కు చెందిన స్పోర్ట్ బ్రాండ్ కాస్టింగ్ వ్యాపారమంతా సోనీ వశమైంది. టెన్ 1, టెన్ 1 హెచ్డీ, టెన్ 2, టెన్ 3, టెన్ గోల్ఫ్ హెడ్డీ, టెన్ క్రికెట్, టెన్ స్పోర్ట్స్ చానళ్లు సోనీ గొడుగు కిందకు చేరనున్నాయి. ఈ చానళ్లు భారత ఉపఖండంతో పాటు మాల్దీవులు, సింగపూర్, హాంకాంగ్, కరేబియన్, మధ్య ప్రాచ్య దేశాల్లో ప్రసారాలను అందిస్తున్నాయి. టెన్ స్పోర్ట్స్ కు సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్సే క్రికెట్ బోర్డులతో ఒప్పందాలు ఉన్నాయి. వీటితో పాటు వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్, ఫుట్ బాల్ లీగ్, యూఈఎఫ్ఏ యూరప్ లీగ్, ఫ్రెంచ్ లీగ్, డబ్ల్యూటీఏ, ఏటీపీ ఈవెంట్స్, యూరోపియన్ టూర్, ఆసియన్ టూర్ వంటి గోల్ఫ్ టర్లు, మోటో జీపీ నిర్వహించే మోటార్ స్పోర్ట్స్, ఆసియా, కామన్వెల్త్ గేమ్స్, టూర్ డీ ఫ్రాన్స్ వంటి సైక్లింగ్ ఈవెంట్లు టెన్ స్పోర్ట్స్ చేతుల్లో ఉన్నాయి. తమ సంస్థకు ఈ డీల్ ఓ మైలురాయి వంటిదని జీ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ గోయంకా వ్యాఖ్యానించారు. టెన్ స్పోర్ట్స్ విలీనంతో ప్రపంచ క్రీడా ప్రసారాల్లో తాము మరింత ఉన్నత స్థానానికి చేరామని తెలిపారు.