: అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్లొద్దు: జీహెచ్ఎంసీ కమిషనర్
భారీ వర్షం ధాటికి హైదరాబాద్‌లోని రోడ్లన్నీ చెరువులని తలపిస్తున్నాయి. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సూచించారు. వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో రోడ్లపై ఉన్న మ్యాన్‌హోల్‌లు తెరిచి పెట్టకూడదని సంబంధిత సిబ్బందికి చెప్పారు. నగర పరిస్థితిపై సమగ్రస్థాయిలో పరిశీలన జరపాలని డిప్యూటీ కమిషనర్లు, ఏంఎంహెచ్‌వోలను ఆయన ఆదేశించారు. వాహనదారులు, ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతం. పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో మోకాళ్లలోతుకి నీరు నిలిచిపోయింది. వాహనాలు నత్తనడకన ముందుకు కదులుతున్నాయి. పాతబస్తీ, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కోఠీ, దిల్సుఖ్నగర్, నల్లకుంట, రామాంతపూర్, ఉప్పల్ ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 040-21111 111, లేదా 100 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యను తెలపవచ్చని అధికారులు పేర్కొన్నారు.