: ప్రపంచంలోని మహిళలు, బాలికలు ప్రతిరోజు 200 మిలియన్ గంటల సమయాన్ని నీళ్లు పట్టడంతోనే గడిపేస్తున్నారట!
ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు మనిషి నీటిని ఉపయోగిస్తూనే ఉంటాడు. మహిళలు, బాలికలు ఉదయాన్నే నీటిపంపుల వద్ద, ట్యాంకర్ల వద్ద నీళ్లు పట్టడం, సుదూర ప్రాంతాలకి వెళ్లి నీళ్లు తీసుకురావడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఆ నీటిని సేకరించడానికే ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు తమ కాలంలో అత్యధిక భాగం వినియోగిస్తున్నారట. ఈ విషయం ఐక్యరాజ్య సమితి బాలల నిధి (యునిసెఫ్) గణాంకాల ద్వారా తెలిసింది. ప్రపంచ జల వారోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ వివరాలను వెల్లడించింది. ప్రతిరోజూ వారంతా కలిసి సుమారు 200 మిలియన్ల గంటలు ఇందుకోసమే వినియోగిస్తున్నారట. అంటే 22,800 సంవత్సరాలకు ఈ సమయం సమానమని యునిసెఫ్ వివరించింది. ఇక భారత్‌లోనూ లక్షలాది బాలికలకు నీళ్లు పట్టడంలోనే అధిక సమయం గడిపేస్తున్నారని యునిసెఫ్ పేర్కొంది. ఐక్యరాజ్య సమితి బాలల నిధి సంస్థలో జల, పారిశుద్ధ్య, ఆరోగ్య విభాగం ప్రపంచ అధిపతి సంజయ్ విజెశేఖర ఈ అంశంపై వివరణ ఇచ్చారు. మహిళలు నీళ్లుపట్టే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, రాతి యుగంలో ఖాళీ బిందెతో నీళ్ల కోసం ప్రయాణం ప్రారంభించిన మహిళ ఇప్పటికీ తన గృహానికి చేరలేనట్లుగా ఉందని ఆయన అభివర్ణించారు. కాలక్రమంలో ప్రపంచం సాధించిన అభివృద్ధిని, మహిళలు సాధించగలిగిన అభివృద్ధిని పోల్చి చూడాలని ఆయన సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లి ఇంటి అవసరాలకు నీళ్లు తీసుకొచ్చే పనిని మహిళలు, బాలికలు నిర్వర్తిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీంతో వారు తమ సమయాన్ని, మంచి అవకాశాలను కోల్పోవలసి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.