: జీఎస్‌టీ తీర్మానం ఏకగ్రీవ ఆమోదం.. తెలంగాణ అసెంబ్లీ అరగంట వాయిదా
వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లుపై శాసనసభలో సీఎం కేసీఆర్ ఈరోజు ప్రవేశపెట్టిన జీఎస్‌టీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ఈ బిల్లు గొప్ప ఆర్థిక సంస్కరణ అవుతుందని అన్నారు. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే జీఎస్‌టీ బిల్లు తీసుకొచ్చారని చెప్పారు. తీర్మానాన్ని తెలంగాణ శాసనసభ సభ్యులంతా ఆమోదించడం శుభపరిణామమని అన్నారు. తెలంగాణ శాసనసభ ఔచిత్యాన్ని పెంచే సందర్భం వచ్చిందని వ్యాఖ్యానించారు. జీఎస్‌టీ తీర్మానం ఏకగ్రీవ ఆమోదం పొందినందుకు హర్షం వ్యక్తం చేశారు. బిల్లు వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లితే ఆ లోటును ఐదేళ్లు భర్తీ చేస్తామని కేంద్రం స్పష్టంగా చెప్పిందని కేసీఆర్ అన్నారు. మన రాష్ట్రానికి వచ్చే రూ.16 వేల కోట్ల ఆదాయంపైనే జీఎస్‌టీ ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. పెట్రో ఉత్పత్తులు, ఎక్సైజ్‌పై జీఎస్‌టీ ప్రభావం ఉండదని ఆయన అన్నారు. పన్నుల ఎగవేతను తగ్గించడానికే జీఎస్‌టీ బిల్లు వస్తోందని పేర్కొన్నారు. అనంతరం స్పీకర్ మధుసూదనాచారి శాసనసభను అరగంట వాయిదా వాయిదా వేశారు. టీ విరామం అనంతరం శాసనసభ తిరిగి కొనసాగనుంది. కాసేపట్లో సభావ్యవహారాల సలహాసంఘం సమావేశం కానుంది.