: అసాధారణ విపత్తు... విస్తుపోతున్న అటవీ శాఖాధికారులు
అటవీశాఖాధికారులకు విస్తుపోయేలా చేసిన ఘటన నార్వేలో చోటుచేసుకుంది. మంచు కురిసే నార్వేలో ధ్రువపు జింకలు కొండల్లో గుంపులుగా సంచరిస్తుంటాయి. మధ్యప్రాంతంలోని హార్డన్ గెర్వడ్డా ప్రాంతంలోని పర్వత ప్రాంతాల్లో జింకల గుంపుపై పిడుగు పడింది. దీంతో జింకలు పెద్దఎత్తున మృతిచెందాయని వన్యప్రాణుల సంరక్షణ అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ధ్రువపు జింకలు ఒకేచోట గుమికూడి ఉంటాయని వారు తెలిపారు. ఇలా ఉండడమే వాటి ప్రాణాలు తీసిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పిడుగుపాటు కారణంగా 323 ధ్రువపు జింకలు ప్రాణాలు కోల్పోయాయని అదికారులు తెలిపారు. వీటి కళేబరాలు విసిరేసినట్టుగా కుప్పలుగా పడి ఉన్నాయని, ఇది అసాధారణ విపత్తు అని, ఇంత పెద్ద విపత్తు సంభవించడం, ఒకే విపత్తులో భారీ సంఖ్యలో ఇన్ని జింకలు ప్రాణాలు కోల్పోవడం ప్రపంచంలో ఇదే ప్రధమమని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను పర్యావరణ వేత్తలు విడుదల చేశారు.