: ఎన్నికలు జరిగితే పోలింగ్ కేంద్రాల వారీ ఫలితాలకు చెల్లు... మోదీ సర్కారు కీలక నిర్ణయం
మరో అతిపెద్ద ఎన్నికల సంస్కరణకు నరేంద్ర మోదీ సర్కారు పచ్చజెండా ఊపింది. వచ్చే సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్ బూత్ ల వారీగా ఎన్నికల ఫలితాలను విడుదల చేయరాదని ఎన్నికల సంఘం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కలగాపులగం చేసి లెక్కింపును చేపట్టాలని, ఏ పోలింగ్ కేంద్రానికి చెందిన ఓటింగ్ మెషీన్ ను లెక్కిస్తున్నామన్న విషయం అధికారులకు, అభ్యర్థుల ఏజంట్లకు తెలియాల్సిన అవసరం లేదని పేర్కొంటూ 1961 నాటి ఎన్నికల నిబంధనల చట్టానికి సవరణలకు క్యాబినెట్ ఆమోదం పలికింది. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, న్యాయ మంత్రి రవి శంకర్ ప్రసాద్ లతో కూడిన క్యాబినెట్ ఉన్నత స్థాయి సమావేశంలో ఎలక్షన్ కమిషన్ సిఫార్సులు, ప్రతిపాదనలకు ఆమోదం పలికినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఈవీఎంలను 2008లో ప్రవేశపెట్టక పూర్వమే ఈ ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం మాత్రం దాల్చలేదు. అసెంబ్లీ ఎన్నికల తరువాత పోలింగ్ బూత్ స్థాయి ఫలితాలు వెల్లడిస్తే, గొడవలు జరగవచ్చన్న అంచనాలతోనే ఈ సిఫార్సులకు ఆమోదం పలికినట్టు ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇక గడచిన మార్చిలో ఆరు జాతీయ పార్టీలతో సమావేశమైన ఈసీ, నూతన విధానంపై అవగాహన సదస్సు నిర్వహించగా, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ తదితర పార్టీలన్నీ దీనికి అంగీకరించిన సంగతి తెలిసిందే. సీపీఎం మాత్రం ఓట్లను కలిపే విధానంపై మరింత స్పష్టత ఇవ్వాలని నాడు డిమాండ్ చేసింది.