: బంగారం కొనాలా?... అయితే రెండు వారాలు ఆగితే ధర తగ్గుతుందంటున్న విశ్లేషకులు!
ప్రస్తుత శుభకార్యాల సీజనులో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారు మరో రెండు వారాలు ఆగితే మంచిదని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ సమీక్షా సమావేశం జరగనుండటం, పావు శాతం నుంచి అర శాతం వరకూ వడ్డీ రేట్ల పెంపు తప్పదని వస్తున్న వార్తలు బులియన్ సెంటిమెంట్ ను వెనక్కు లాగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే, ప్రస్తుతం 1,340 డాలర్లుగా ఉన్న ఔన్స్ బంగారం (31.1 గ్రాములు) ధర 1000 డాలర్ల లోపునకు దిగిరావచ్చని అంచనా వేస్తున్నారు. ఫెడ్ నిర్ణయమే సమీప భవిష్యత్తులో బంగారం ధరను ప్రభావితం చేయనుందని వ్యాఖ్యానించారు. కాగా, ఈ సంవత్సరం 1,370 డాలర్ల వరకూ చేరిన ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం 1,324 డాలర్లకు దిగివచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాలో 10 గ్రాముల బంగారం ధర రూ. 31,385 (99.9 ప్యూరిటీ) వద్ద కొనసాగుతోంది. సెప్టెంబరులో ఫెడ్ సమావేశంలో వెలువడే నిర్ణయంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర 1,285 డాలర్ల నుంచి 1,300 డాలర్ల మధ్య కొనసాగుతుందని రిద్దిసిద్ధి బులియన్ మేనేజింగ్ డైరెక్టర్ పృద్వీరాజ్ కొఠారీ అంచనా వేశారు. అయితే, ఇండియాలో వచ్చే వారంలో వినాయక చవితితో పండగల సీజన్ ప్రారంభం కానుండటం, ఆపై దసరా, దీపావళి పర్వదినాలు, వివాహాది శుభకార్యాల కారణంగా ధరల తగ్గుదలకు ప్రతిబంధకాలు ఏర్పడవచ్చని ఏంజిల్ బ్రోకింగ్ ప్రతినిధి నవీన్ మాథుర్ అభిప్రాయపడ్డారు. ఏదీ ఏమైనా యూఎస్ ఫెడ్ సమీక్షలో వడ్డీ రేట్లు పెంచితే, బంగారం ధరలు మరోసారి రూ. 30 వేల కిందకు దిగిరావడం ఖాయంగా కనిపిస్తోంది.