: ఒక్క రోజులో శ్రీశైలం, తిరుమల, శ్రీకాళహస్తి దర్శనం... ఏపీ టూరిజం ప్రత్యేక ప్యాకేజీ


ఉదయం 8 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయానికి అటు శ్రీశైల మల్లన్నను, ఇటు తిరుపతి వెంకన్నను దర్శించుకుని వస్తే ఎంత బాగుంటుంది? ఆ అవకాశాన్ని ఏపీ సర్కారు కల్పిస్తోంది. టూరిజం ప్రమోషన్ లో భాగంగా హెలికాప్టర్ తో, వీఐపీ సర్వీస్ ను భక్తులకు అందించాలని నిర్ణయించింది. ఢిల్లీకి చెందిన ఏవియేషన్ సంస్థ సమ్మిట్, ప్రభుత్వంతో కుదుర్చుకున్న డీల్ లో భాగంగా, విజయవాడ, హైదరాబాద్ నగరాల నుంచి రోజూ శ్రీశైలం, తిరుమలకు పర్యటనలు సాగనున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నట్టు అధికారులు తెలిపారు. ఇక 24 గంటల్లో టూర్ ఎలా సాగుతుందంటే... ఉదయం 8 గంటలకు విజయవాడలో హెలికాప్టర్ కదులుతుంది. 8:30 కెల్లా శ్రీశైలం చేరుకుంటుంది. సున్నిపెంటలోని హెలికాప్టర్ నుంచి దేవస్థానం వరకూ కారు ఏర్పాటు ఉంటుంది. గుడిలో స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమపూజను ప్రత్యేకంగా చేయిస్తారు. ఆపై పాతాళగంగలో బోట్ షికారు, స్థానికంగా ఉండే ప్రాంతాలను చూపుతారు. మధ్యాహ్నం 12:30కి శ్రీశైలం నుంచి బయలుదేరే హెలికాప్టర్ 1:30కి తిరుపతి వెళుతుంది. తొలుత తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవాలయం, మంగాపురం, శ్రీకాళహస్తి చూపించి, ఆపై రాత్రికి తిరుమలలో వసతి ఏర్పాటు చేస్తారు. మరుసటి రోజు తెల్లవారుఝామున వీఐపీ బ్రేక్ దర్శనం చేయిస్తారు. తిరిగి 7:30 గంటల సమయంలో హెలికాప్టర్ విజయవాడకు బయలుదేరి గంటలోపే గమ్యానికి చేరుతుంది. ఇదే విధంగా హైదరాబాద్ నుంచి కూడా మరో ప్యాకేజీ ఉంటుంది. ఈ మొత్తం టూర్ కు సంబంధించి ఎంత వసూలు చేయనున్నారన్న సంగతి నేడో రేపో వెల్లడి కానుంది.

  • Loading...

More Telugu News