: రెండో టీ20 వర్షార్పణం.. విండీస్‌దే సిరీస్
మొదటి టీ20లో అనూహ్య ఓటమికి ప్రతీకారం తీర్చుకుందామనుకున్న టీమిండియాకు వరుణుడు షాకిచ్చాడు. స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత్‌పై వరుణుడు నీళ్లు కుమ్మరించాడు. ఫలితంగా మ్యాచ్ రద్దయింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను కరీబియన్లు 1-0తో కైవసం చేసుకున్నారు. తొలుత టాస్ గెలిచిన ధోనీ మరో మాట లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్‌లో సిక్స్‌ల మోత మోగించిన విండీస్ బ్యాట్స్‌మెన్ ఈసారి భారత బౌలర్ల దాటికి క్రీజుపై నిలబడలేకపోయారు. తొలి మ్యాచ్‌లో పరుగులు సమర్పించుకున్న బిన్నీ స్థానంలో జట్టులోకి వచ్చిన స్పిన్నర్ మిశ్రా విండీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. ఫలితంగా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూకట్టారు. సిమన్స్(17), శామ్యూల్స్(5), పొలార్డ్(13), ఫ్లెచర్(3) బ్రావో(3) రస్సెల్స్(13), బ్రాత్‌వైట్(18), బద్రీ(1).. ఇలా అందరూ వెంటవెంటనే అవుటవడంతో 143 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా 3, అశ్విన్, బుమ్రా, షమీ రెండేసి వికెట్లు తీసుకున్నారు. అనంతరం 144 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత్ బ్యాటింగ్ కేవలం రెండు ఓవర్లపాటు మాత్రమే సాగింది. జట్టు స్కోరు 15 పరుగుల వద్ద ఉన్న దశలో వర్షం పడడంతో ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత వర్షం తగ్గినా మైదానం తడిగా ఉండడంతో ఆటను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. దీంతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 0-1తో చేజార్చుకుంది.