: సెటిల్ మెంటుకు సెంటిమెంటు!... దానికో ఉప సెంటిమెంటు!: నయీమ్ దందాలో కొత్త కోణం!
తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాల తూటాలకు హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ దందాకు సంబంధించి రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. నక్సలైట్ గా జీవితం ప్రారంభించి ఆ తర్వాత నక్సల్స్ కే వ్యతిరేకిగా మారిన నయీమ్ దందాపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర కథనాలు వెలుగుచూస్తున్నాయి. సదరు కథనాలన్నింటిలోకి ఈ కథనం వెరైటీదేనని చెప్పాలి. నయీమ్ కు కప్పం కట్టేందుకు తిరస్కరించే వ్యాపారులు, బడా బాబులపై అతడి అనుచరులు ఓ లుక్కేస్తారు. ముందుగా చెప్పి చూసి ఫలితం లేదని భావిస్తే...బాధితులకు మూడినట్లేనట. ఫోన్ చేసి భువనగిరి శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయం, లేదంటే పాత బస్టాండ్ వద్దకు వారిని రప్పించి బెదిరిస్తారట. ఇక ఎల్లమ్మ ఆలయంలో దర్శనం తర్వాతే బాధితులను నయీమ్ వద్దకు వారు తీసుకెళతారట. నయీమ్ సాగించిన అన్ని దందాల్లో ఇదో సెంటిమెంటుగా మారగా... ఈ సెంటిమెంటులోనూ మరో ఉప సెంటిమెంటు కూడా ఉందట. ఎల్లమ్మ ఆలయం వద్దకు వచ్చిన తర్వాత బాధితులను నయీమ్ అనుచరులు ‘డస్టర్’ మోడల్ కు చెందిన కారులోనే ఎక్కించేవారట. ఇక ఆ కారులో బాధితులతో పాటు నయీమ్ ముఖ్య అనుచరులు శ్రీనివాస్, జడ్పీటీసీ సందెల సుధాకర్, కారు డ్రైవర్ కత్తుల జంగయ్య మాత్రమే ఎక్కేవారట.