: పవన్ మీటింగ్ ముగిసింది... పార్టీలు విశ్లేషణలు మొదలు పెట్టేశాయి!
రెండు రోజుల క్రితం సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలో సభ పెడతానని ప్రకటించినప్పుడు, సభా ప్రాంగణం కోసం అనుమతి కోరినప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలన్నీ ఒక్కసారి అలెర్టయ్యాయి. అసలు జనసేనాని ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఏం చెబుతారు? సినీ సమావేశమా? రాజకీయ సమావేశమా? అంటూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పార్టీ ఆసక్తి వ్యక్తం చేసింది. ఆయన ఏం మాట్లాడతాడు? అంటూ లోపాయకారీగా ఎంక్వయరీ కూడా ఆరంభించాయి. అయితే ఏ విధమైన లీకు రాకపోవడంతో అంతా ఆయన సభలో ఏం మాట్లాడుతాడోనని అంతా ఆసక్తిగా గమనించారు. అందరి ఉత్కంఠను బ్రేక్ చేస్తూ ... ఏపీకి ప్రత్యేకహోదాపై పవన్ స్పష్టమైన ప్రసంగం చేశారు. హోదాకి అనుకూలంగా స్టాండ్ తీసుకోని పార్టీలను తూర్పారపడుతూ పవన్ కల్యాణ్ స్పష్టంగా మాట్లాడారు. దీంతో ఏపీలో రాజకీయపార్టీల విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకునే రాజకీయ క్రీడ మొదలైపోయింది. పవన్ కల్యాణ్ తమను విమర్శించలేదని, ప్రత్యేకహోదా కోసం తాము చాలా చేశామని, అందువల్లే హోదా వాదన ఇంకా బతికి ఉందని కొన్ని పార్టీలు... తాము బంద్ లు, పార్లమెంటు వెల్ లో నిరసనలు, చర్చలు తీసుకొచ్చామని కొన్ని పార్టీలు వాదనలు ప్రారంభించడం ఆసక్తి రేపుతోంది.