: మరికాసేపట్లో జనసేన సభ ప్రారంభం.. పవన్ కల్యాణ్ సూచనతో కొంతమంది ఫ్యాన్స్ అక్కడి నుంచి ఇంటి దారి!
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలో ఈరోజు నిర్వహించతలపెట్టిన బహిరంగ సభ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. సభకు ఐదు వేల నుంచి పది వేల మంది మధ్య అభిమానులు వస్తారని అంచనా. పవన్ ప్రసంగం 45 నిమిషాల నుంచి గంట సేపు ఉంటుందని తెలుస్తోంది. ప్రత్యేక హోదా, ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలపై ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లయినా హోదాపై సానుకూల ప్రకటన రాలేదని, పవన్ దాని గురించి మాట్లాడనున్నారని జనసేన కార్యకర్తలు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. సభ ప్రాంగణానికి ఇప్పటికే వేలాది మంది అభిమానులు చేరుకున్నారు. అయితే, అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండడంతో సభను నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తలు కొందరు అభిమానులను తిరిగి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. సభా ప్రాంగణంలో ఎనిమిది వేల మందికన్నా ఎక్కువ పట్టే అవకాశం లేదు. సభలో తొక్కిసలాట లాంటి ప్రమాదం జరగకుండా పవన్ కల్యాణ్ కొంతమంది అభిమానులను తిరిగి వెళ్లిపోవాలని సూచించినట్లు తెలుస్తోంది. త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ జనసేన సభ నిర్వహించనున్నారు. నేటి సభకు చిత్తూరు జిల్లా వాసులకే హాజరయ్యే అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది.