: ఈసారి మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్‌ను అరెస్టు చేస్తారు: కేజ్రీవాల్ జోస్యం
ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్‌ను త్వరలోనే అరెస్టు చేస్తారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌పై ఆయన తరుచూ మండిపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. స్వాతి మలివాల్‌ను తొలగించేందుకు వారిరువురూ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆమెను త్వరలోనే అరెస్టు చేసి, ఆమె నిర్వర్తిస్తోన్న బాధ్యతల నుంచి తొలగిస్తారని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. ఏసీబీ అధికారులు ఇటీవలే స్వాతి మలివాల్ ఆఫీస్ పై దాడులు చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఇలా స్పందించారు. తమ ప్రభుత్వ విషయాల్లో కేంద్రం పదేపదే జోక్యం చేసుకుంటోందని ఆయన విమర్శించారు.