: పూట గడవక పూరీలమ్ముకుంటున్న మాజీ ఒలింపియన్ సీతా సాహు!
ఒలింపిక్స్ లో పతకం సాధించడమంటే అదేమీ సామాన్య విషయం కాదు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ఆటగాళ్లతో పోటీపడి, ఉత్తమ ప్రదర్శన కనబరిస్తేనే పతకం వస్తుంది. ఇక పతకం వస్తే వారి పేరు మారు మోగిపోతుంది. ప్రభుత్వాలు ప్రోత్సాహకాల వరాలను కురిపిస్తాయి. డబ్బుల వర్షం కురుస్తుంది. ఇటీవల ముగిసిన రియోలో పతకాలు సాధించిన పీవీ సింధు, సాక్షిలను చూస్తే ఇదే అనిపిస్తుంది. వారి కష్టానికి తగ్గ ఫలితం అందిందని అందరమూ అనుకుంటాం. ఇది నాణానికి ఓ వైపు మాత్రమే! మరోవైపు హృదయ విదారక గాధలూ ఉన్నాయి. ఒలింపియన్లలో కూడా తమ ప్రతిభకు గుర్తింపు రాక, పూట గడవక జీవన గమనం కోసం నానా ఇబ్బందులూ పడుతున్న వారున్నారు. వారిలో ఒకరే సీతా సాహు. 2011లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్ లో 200, 400 మీటర్ల రన్నింగ్ రేస్ లో సత్తా చాటి రెండు కాంస్య పతకాలను దేశానికి అందించింది సీత. పేద కుటుంబంలో పుట్టిన ఆమెకు చేదోడుగా నిలిచి మెరుగైన శిక్షణ ఇప్పించేందుకు ఏ ప్రభుత్వమూ ముందుకు రాలేదు. ఇల్లే గడవని వేళ, శిక్షణ ఎందుకని భావించిన ఆమె, ఇప్పుడు తన ఇంటి ముందే పూరీల వ్యాపారం చేసుకుంటోంది. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించే విధానం ఇండియాలో లేకనే పతకాలు రావడం లేదని ఎంతో మంది ఆగ్రహిస్తున్న వేళ, సీతకు వచ్చిన దుస్థితి మరొకరికి రాకుండా ఉండాలని కోరుకుందాం.