: ఇదో వింత.. ప్రత్యర్థులుగా నిలబడిన వ్యక్తులను ఓడించి ముచ్చటగా మూడోసారి మేయర్‌గా ఎన్నికైన కుక్క!
అమెరికాలోని కార్మొరాంట్ అనే పట్టణంలో ఓ కుక్క ముచ్చటగా మూడోసారి మేయర్‌గా ఎన్నికైంది. ఆ హోదాను సాధించి అత్యున్నత అధికారాలు పొందింది. నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే మేయర్ పదవిని ఇటీవలే మూడోసారి సగర్వంగా స్వీకరించి రికార్డు నెలకొల్పింది. మనదేశంలో సాధారణంగా మేయర్ పదవి కోసం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు ఉంటాయి. అమెరికాలో వారి రాజ్యాంగం ప్రకారం ప్రతి ఏడాది నిర్వహిస్తారు. ఎన్నికల్లో ఓ శునకం గెలుపొందడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మేయర్‌గా బాధ్యతలు స్వీకరించే అర్హతను ఓ కుక్కకు అప్పజెప్పిన పౌరులు.. ఎన్నికల్లో ఓట్లు వేసి దాన్ని మేయర్‌ని చేయడం పట్ల ఈ వార్తని వింటున్న వారంతా ఇదేం వింత? అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్మొరాంట్ పట్టణంలో డ్యూక్ అనే 9 సంవత్సరాల కుక్క ఈ ఘనత సాధించింది. డ్యూక్ ప్రత్యర్థులుగా నిలబడింది కూడా శునకాలేనేమో అనుకుంటున్నారా? కాదు.. ఇద్దరు వ్యక్తులు దానికి పోటీగా నిలబడగా డ్యూక్ వారిపై ఘనవిజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. 1013 మంది జనాభా ఉన్న ఉన్న ఆ గ్రామంలో గత కొన్నేళ్ల నుంచి ఈ శునకం మేయర్‌గా పోటీ చేస్తూనే ఉందట. గతంలోనూ ఈ పోటీలో రెండుసార్లు ప్రత్యర్థులను ఓడించింది. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే, బరిలో నిలబడిన ప్రత్యర్థులు కూడా డ్యూక్కే వారి ఓటు వేశారు. డ్యూక్‌పై వారు ఇంతగా ఎందుకు ప్రేమ పెంచుకున్నారో కానీ మొత్తానికి అందరినీ ఆకర్షించి మేయర్‌గా గెలిచింది.