: వచ్చే మూడు ఒలింపిక్స్ లో పతకాల వేటకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తా: మోదీ ప్రకటన
ఒలింపిక్స్ లో భారత్ సాధించిన పతకాలపై అంతర్జాతీయ స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇంచుమించి 130 కోట్ల జనాభా కలిగిన భారత్ కేవలం రెండు పతకాలు గెలుచుకోవడంతో మీడియా, క్రీడా వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న మూడు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించేందుకు అవసరమైన క్రీడాకారులను తయారు చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 2020, 2024, 2028 సంవత్సరాల్లో జరిగే ఒలింపిక్స్ లో భారత ఉత్తమ ప్రదర్శనకు కావాల్సిన యాక్షన్ ప్లాన్ ను ఈ టాస్క్ ఫోర్స్ తయారు చేయనుంది. అందుకు కావాల్సిన క్రీడా సదుపాయాలు, శిక్షణ, ఎంపిక విధానం తదితర అన్ని విషయాలపై వీరు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని క్రీడాకారులను సానబెట్టనున్నారు. దీంతో భారత క్రీడల ముఖచిత్రం మారనుందని, విశ్వ క్రీడల్లో భారత ప్రతిభ ప్రకాశించనుందని ఆశిద్దాం.