: రేస్ వాక్ అథ్లెట్ మనీష్ సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే నవ్వుకునేవారట!
రియో ఒలింపిక్స్ లో రేస్ వాక్ ఫైనల్స్ లో పాల్గొన్న భారత్ అథ్లెట్ మనీష్ సింగ్ రావత్ విఫలమైనప్పటికీ, అతను మొదటి నుంచి కష్టపడ్డ తీరు మాత్రం చాలా ఆసక్తికరం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సాగర్ గ్రామానికి చెందిన మనీష్ సింగ్ రావత్ పేదకుటుంబానికి చెందిన వాడు. అతని తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో కుటుంబ భారం మనీష్ పై పడింది. ఈ నేపథ్యంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన బదరీనాథ్ లోని కృష్ణ అనే హోటల్ లో వెయిటర్ గా చేరాడు. అయితే, రేస్ వాకర్ గా తన సత్తా చాటాలనే కోరిక తన చిన్నతనం నుంచే మనీష్ కు ఉండేది. దీంతో, తన లక్ష్యాన్ని మరవని మనీష్, హోటల్ లో పనిచేస్తూనే, తీరిక దొరికినప్పుడు రేస్ వాక్ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. రోడ్డుపై ప్రాక్టీస్ చేసే సందర్భాల్లో అతన్ని చూసి చాలామంది నవ్వుకుంటుండే వారు. ఇవేమీ లెక్కచేయని మనీష్ రేస్ వాక్ లో క్రమక్రమంగా జాతీయ స్థాయి అథ్లెట్ గా ఎదిగాడు. గత ఏడాది బీజింగ్ లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ అథ్లెటిక్స్ లో తన సత్తా చాటుకున్న మనీష్ కు ‘రియో’లో పాల్గొనే అవకాశం లభించింది.