: రేపు సాయంత్రం తిరుపతిలో జనసేన సభ!... ఆ తర్వాత అన్ని జిల్లాల్లో కూడానట!
టాలీవుడ్ అగ్ర హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్... జనసేన పేరిట స్థాపించిన తన పార్టీని ఇక జన బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు దాదాపుగా సిద్ధమయ్యారు. టాలీవుడ్ యంగ్ హీరో అభిమానుల చేతిలో ప్రాణాలు వదిలిన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నిన్న తిరుపతి వచ్చిన పవన్ కల్యాణ్... నిన్న సాయంత్రానికే తిరుమలకు చేరుకున్నారు. ఆ తర్వాత తిరుమలలో వెంకన్న దర్శనం తర్వాత తనకు కేటాయించిన గెస్ట్ హౌస్ కు చేరుకున్న ఆయన తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న పలువురితో రహస్యంగా భేటీ అయ్యారు. రేపు తిరుపతిలో భారీ బహిరంగ సభకు ఆయన దాదాపుగా సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన ఆదేశాల మేరకు ఆయన అభిమానులు తిరుపతిలో బహిరంగ సభ వేదిక కోసం పరిశీలన జరుపుతున్నారు. ఇదిలా ఉంటే జనసేన ప్రస్థానాన్ని తిరుపతి నుంచి ప్రారంభించనున్న పవన్ కల్యాణ్... ఆ తర్వాత అన్ని జిల్లాల్లోనూ పార్టీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.