: ఆలస్యానికి మూల్యం చెల్లించాల్సిందేనన్న సుప్రీంకోర్టు!... చెల్లించలేమన్న పార్శ్వనాథ్ డెవలపర్స్!
మొన్న యూనీటెక్... నేడు పార్శ్వనాథ్ డెవలపర్స్... ఆలస్యానికి మూల్యం చెల్లించుకోవాల్సిన రియల్ ఎస్టేట్ సంస్థల జాబితాలో చేరిపోయాయి. నోయిడాలో ఇచ్చిన హామీ మేరకు సకాలంలో నిర్మాణాలను పూర్తి చేయని యూనీటెక్... తన వినియోగదారులకు మొత్తం డబ్బును తిరిగి చెల్లించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు చెప్పింది. తాజాగా అదే తరహాలో రియల్ ఎస్టేట్ రంగంలో మరో ప్రముఖ సంస్థగా ఎదిగిన పార్శ్వనాథ్ డెవలపర్స్ కు కూడా సుప్రీం ధర్మాసనం షాకిచ్చింది. ఘజియాబాదులో నిర్ణీత గడువులోగా నిర్మాణాలను పూర్తి చేయలేని కారణంగా ముందుగానే డబ్బులు కట్టిన 70 మంది వినియోగదారులకు మొత్తం డబ్బును 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పుపై యూనీటెక్ లా సైలెంట్ గా వెళ్లిపోయేందుకు పార్శ్వనాథ్ డెవలపర్స్ ససేమిరా అన్నది. తమ సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఆ డబ్బును తిరిగి చెల్లించలేమని సుప్రీం ధర్మాసనానికే తేల్చిచెప్పింది. మరి, ఈ వ్యవహారం ఎంతదాకా వెళుతుందో చూడాలి.