: జియో దెబ్బకు 50 శాతం రేట్లు తగ్గిస్తూ, అన్ లిమిటెడ్ డేటా ప్లాన్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్


ఉచిత డేటా ఆఫర్లంటూ ఆకర్షణీయ ప్రకటనలతో రిలయన్స్ జియో దూసుకొస్తుండగా, తమకు జరిగే నష్ట నివారణకు టెలికం దిగ్గజాలు తమవంతు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ డేటా చార్జీలను 50 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇదే సమయంలో నెలకు రూ. 1,099 చెల్లింపుతో అపరిమిత 3జీ డేటాను వాడుకునేలా కొత్త ప్లాన్ ను తెరపైకి తెచ్చింది. పాత ప్లాన్లపై రెట్టింపు డేటాను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. "బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ పనితీరు మెరుగుపడింది. గతంలో దూరమైన కస్టమర్లు ఇప్పుడు తిరిగి వస్తున్నారు. ఇండియాలోనే తొలిసారిగా రూ. 1,099కి అన్ లిమిటెడ్ 3జీ ప్లాన్ ప్రకటిస్తున్నాం. ఇందులో డేటా బట్వాడా వేగం తగ్గడమన్న మాటే ఉండదు" అని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాత్సవ వ్యాఖ్యానించారు. కాగా, గడచిన ఏప్రిల్ లో బీఎస్ఎన్ఎల్ మొత్తం 11.39 లక్షల కొత్త వినియోగదారులను తమ నెట్ వర్క్ పరిధిలోకి చేర్చుకుంది. ఇదే సమయంలో భారతీ ఎయిర్ టెల్ 9.78 లక్షలు, ఎయిర్ సెల్ 5.72 లక్షలు, రిలయన్స్ 1.1 లక్షలు, వోడాఫోన్ 46,600, ఎంటీఎన్ఎల్ 11,591 మందిని చేర్చుకున్నాయి. పోటీలోని టెలికం కంపెనీలు డేటా రేట్లను 67 శాతం మేరకు తగ్గించగా, బీఎస్ఎన్ఎల్ సంస్థ రూ. 549 ప్లాన్ పై ప్రస్తుతమున్న 5 జీబీ డేటాను 10 జీబీకి పెంచుతున్నట్టు వెల్లడించింది. రూ. 156 రూపాయలపై 10 రోజుల కాలపరిమితిలో 2 జీబీ డేటాను అందిస్తున్నామని పేర్కొంది.

  • Loading...

More Telugu News