: జగన్ నుంచి దూరం చేసే యత్నం!... కుట్ర ఫలించబోదన్న ధర్మాన!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుపుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నిన్న కొత్త వాదనను వినిపించారు. తనను జగన్ కు దూరం చేయడంలో భాగంగానే కొన్ని పత్రికలు తాను అనని వ్యాఖ్యలను కూడా పనిగట్టుకుని రాశాయని ఆయన ఆరోపించారు. అయితే జగన్ నుంచి తనను దూరం చేసేందుకు జరుగుతున్న ఈ కుట్రలు ఎంతమాత్రం ఫలించబోవని ఆయన వ్యాఖ్యానించారు. కడపలో జగన్ గెలవడం పెద్ద విషయమేమీ కాదని, శ్రీకాకుళంలో నిలబడితే జగన్ గెలుపు కూడా కష్టమేనని మొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ క్రమంలో సదరు వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు నిన్న శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తనను జగన్ నుంచి విడదీయడం ఎవరి తరం కాదని ఆయన తేల్చిచెప్పారు. పార్టీ బలోపేతం దిశగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ పార్టీలోని లోపాలను సరిదిద్దే క్రమంలోనే మొన్న ఆ వ్యాఖ్యలు చేశానంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే తన వ్యాఖ్యలను కొందరు పనిగట్టుకుని వక్రీకరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కడప, నెల్లూరు జిల్లాల్లో వైసీపీని సమర్ధిస్తున్నట్లుగానే శ్రీకాకుళం జిల్లాలోనూ పార్టీని సమర్ధించే పరిస్థితి రావాలన్న ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని పేర్కొన్నారు. అంతే తప్పించి సదరు వ్యాఖ్యల్లో తన ఉద్దేశం వేరే కాదని, కాని కొందరు పనిగట్టుకుని సదరు వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు.