: పురాతన శివలింగాన్ని తరలిస్తుండగా వెంటపడ్డ పాము...పరుగులు తీసిన అధికారులు
పురాతన శివలింగంతో పాటు మరో రెండు విగ్రహాలను తరలిస్తున్న అధికారులను ఒక పాము పరుగులు తీయించిన ఆశ్చర్యకరమైన సంఘటన ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామానికి చెందిన భూస్వామి రాజా తన పొలాన్ని చదును చేయిస్తున్న క్రమంలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ఇందులో పురాతన శివలింగం, వీరభద్రుడి విగ్రహంతో పాటు గుర్తుపట్టడానికి వీలు లేని మరో విగ్రహం ఉన్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు నిన్న అక్కడికి వెళ్లి విగ్రహాలను పరిశీలించారు. అనంతరం, ఆ విగ్రహాలను స్వాధీనం చేసుకున్న తహశీల్దార్ కనకదుర్గ వాటిని పురావస్తు శాఖ కార్యాలయానికి పంపించేందుకు తీసుకువెళ్తుండగా ఒక పాము ఆమెను వెంబడించింది. దీంతో, భయాందోళనలకు గురైన ఆమె, సిబ్బంది పరుగులు తీశారు. అక్కడి నుంచి కార్యాలయానికి చేరుకున్న వారికి వింత అనుభవాలు ఎదురయ్యాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పడంతో వారి ఆదేశాల మేరకు ఆ విగ్రహాలను ఎక్కడి నుంచి అయితే తీసుకువచ్చారో తిరిగి అక్కడికే ఈరోజు చేర్చారు.