: విదేశీ టూరిస్టు జంటను 'వామ్మో ఇండియానా?' అనేలా దోచుకున్న టాక్సీ డ్రైవర్!
ఎన్నో ఆశలతో భారత పర్యటనకు వచ్చిన ఓ విదేశీ జంటను ఓ టాక్సీ డ్రైవర్, ట్రావెల్ ఎజెన్సీ కలిసి వామ్మో ఇండియానా? అనుకునేలా భయపెట్టిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. జర్మనీకి చెందిన నైనా ఫరీనా, స్పానిష్ మిత్రుడు అలెక్స్ తో కలిసి ప్లాన్డ్ గా భారత పర్యటనకు వచ్చారు. ముందుగానే ఆమె సిద్ధం చేసుకున్న ప్లాన్ ప్రకారం ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగగానే వారు బుక్ చేసుకున్న హోటల్ కు టాక్సీలో బయల్దేరారు. టాక్సీ వాలా వారు ఇండియాకు రావడం ఇదే తొలిసారి అని గుర్తించాడు. అంతే, వారికి ఢిల్లీలో కర్ఫ్యూ వాతావరణం ఉందని చెప్పాడు. నగర శివార్లలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో టాక్సీలో వారిని తిప్పుతూ వేల రూపాయలు గుంజాడు. ఢిల్లీలో పర్యటన ఇప్పుడు సరికాదని చెబుతూ వారిని జైపూర్, వారణాసి ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తూ, ట్రావెల్ ఏజెన్సీకి అప్పగించాడు. అక్కడ ట్రావెల్ ఏజెన్సీ దోపిడీ పర్వం మొదలైంది. ట్యాక్సుల పేరు చెప్పి వారు నిలువు దోపిడీ చేశారు. మరోపక్క, అయితే ఎయిర్ పోర్టులో దిగామని, టాక్సీలో వచ్చేస్తామని హోటల్ సిబ్బందికి (వీరు ముందుగానే బుక్ చేసుకున్న హోటల్) వీరు సమాచారం ఇవ్వడంతో... వారు ఎంతకూ హోటల్ కు చేరకపోవడంతో హోటల్ సిబ్బంది వారికి ఫోన్ చేశారు. దీంతో వారు జరిగినది చెప్పగా, అసలు ఢిల్లీలో కర్ఫ్యూనే లేదని చెప్పాడు. ఢిల్లీలో అంతా బాగుందని చెప్పడంతో మోసపోయామన్న విషయం గుర్తించారు. దీంతో ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, ఈ కేసు తమ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదని చెప్పడంతో వివిధ పోలీస్ స్టేషన్లకు తిరిగి విసిగిపోయి, మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తమకు జరిగిన దోపిడీని వివరించారు.