: ఏడేళ్లలో ఐదున్నర రెట్లు పెరిగిన రాకేష్ ఝున్ ఝున్ వాలా పెట్టుబడులు


భారత స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ ఝున్ ఝున్ వాలా, ఆయన భార్య రేఖలకు మొత్తం రూ. 8,900 కోట్ల విలువైన ఈక్విటీలు వివిధ కంపెనీల్లో ఉన్నాయి. జూన్ త్రైమాసికం ముగిసేసరికి దలాల్ స్ట్రీట్ లో ఆయనే అతిపెద్ద ఇన్డివిడ్యువల్ పబ్లిక్ షేర్ హోల్డర్. ఇక ప్రపంచాన్ని 2008లో గడగడలాడించిన ఆర్థిక మాంద్యం ముగిసేనాటికి, అంటే జూన్ 2009 నాటికి రాకేష్ ఈక్విటీల విలువ రూ. 1,618 కోట్లు కాగా, అదిప్పుడు దాదాపు 5.5 రెట్లు పెరిగింది. రాకేష్ దంపతులకు ఐటీ కంపెనీ ఆప్ టెక్, ఔషధ సంస్థలు అరవిందో ఫార్మా, లుపిన్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంస్థలైన దివాన్ హౌసింగ్, కరూర్ వైశ్యాబ్యాంక్ తదితరాల్లో పెట్టుబడులు ఉన్నాయి. కాగా, రాకేష్ తాజాగా ఇంటర్వ్యూ ఇస్తూ, భారత స్టాక్ మార్కెట్ లో బుల్స్ వీరవిహారం చేసే రోజులు ముందున్నాయని, ఇప్పటి పెరుగుదల నామమాత్రమేనని వ్యాఖ్యానించడం గమనార్హం. మార్కెట్ గమనాన్ని పరిశీలిస్తూ, అమ్మకాలు, కొనుగోళ్లను సమయానుకూలంగా జరపడమే తన విజయ రహస్యమని ఆయన అన్నారు. ఇక ఇప్పటికే తనకు వాటాలున్న టాటా మోటార్స్, ఇంటలెక్ట్ డిజైన్ అరీనా, ఎస్కార్ట్స్ తదితర కంపెనీల్లో రాకేష్ మరింత ఈక్విటీని కొనుగోలు చేశారు. ఇదే సమయంలో మెక్ నాలీ భారత్ ఇంజనీరింగ్, పోలారిస్ తదితర కంపెనీల్లో వాటాలను ఉపసంహరించుకున్నారు. వీఐపీ ఇండస్ట్రీస్, ఆటోలైన్ తదితరాల్లో తమ ఈక్విటీని తగ్గించుకున్నారు.

  • Loading...

More Telugu News