: చంద్రబాబు ఇచ్చిన స్వేచ్ఛ వల్లే పుష్కరాల్లో అద్భుతం సృష్టించగలిగాం: సినీ దర్శకుడు బోయపాటి శ్రీను
కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఆధ్వర్యంలో విజయవాడలోని ఫెర్రీ పవిత్ర సంగమం వద్ద భారీ సెట్టింగ్, నమూనా దేవాలయాలు రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. బోయపాటినే ‘సరైనోడు’గా భావించిన ప్రభుత్వం ఆ బాధ్యతలను ఆయనకు ఇచ్చింది. పన్నెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా పుష్కరాలు వైభవంగా జరిగి ముగిసిన సందర్భంగా బోయపాటి ఈరోజు ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పుష్కరాల్లో భక్తుల నుంచి వచ్చిన స్పందన సంతృప్తినిచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్వేచ్ఛవల్లే అద్భుతం సృష్టించగలిగామని పేర్కొన్నారు. నదీహారతి కోసం కళాదర్శకుడు సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ చిన్నా అద్భుతంగా పనిచేశారని అన్నారు. పుష్కరాలు తనలో నింపిన అనుభూతిని, ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని బోయపాటి అన్నారు. హారతి, మ్యూజిక్, స్పెషల్ ఎఫెక్ట్ అన్ని బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించామని పేర్కొన్నారు. భక్తుల సంతోషాన్ని తాను కళ్లారా చూసినట్లు తెలిపారు. చంద్రబాబు అశించిన దానికి తగ్గట్లే ఏర్పాట్లు సమర్థవంతంగా చేశామని బోయపాటి చెప్పారు. కృష్ణా పుష్కరాల్లో ఎంతో శ్రద్ధ వహించి పనులు చేశామని అన్నారు. ప్రజల్లో భక్తి భావం మరింత తీసుకురావడాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. తమతో పాటు పనిచేసిన సిబ్బంది ఎంతో ఓర్పుతో పనులు చేశారని అన్నారు.