: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. 45 నిమిషాలు ఇక్కడే ఉంటా.. ఆధారాలు తీసుకుని ఇక్కడకు రా.. రాజీనామా చేస్తా: బేగంపేటలో కేసీఆర్ సవాల్
మహారాష్ట్రతో మూడు సాగునీటి ప్రాజెక్టులకు ఒప్పందం చేసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబయి నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆయన ర్యాలీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒకనాడు ఒక్కొక్క బొట్టు నీటి కోసం ఎంతో కష్టపడ్డామని అన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం మన రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని అన్నారు. చిరకాలం నీళ్లందించే వరప్రదాయిని ఈ ఒప్పందం అని వ్యాఖ్యానించారు. వర్షాలు రాక పంటలు ఎండిపోతున్నాయని, వర్షాల కోసం ముక్కోటి దేవుళ్లకు రైతులు మొక్కుతున్నారని కేసీఆర్ అన్నారు. ఎంతో సంయమనం పాటించి ఒప్పందం చేసుకున్నామని అన్నారు. రైతులు వర్షం కోసం ఇకపై ఆకాశంవైపు చూడాల్సిన అవసరం ఉండబోదని ఆయన అన్నారు. ‘తెలంగాణ ప్రజలందరూ సంతోషం గానే ఉన్నారు.. కాంగ్రెస్ తప్ప. 152 మీటర్లకి తుమ్మిడిహట్టి ఒప్పందం జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ అంశాన్ని నిరూపించాలి. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. నేను 45 నిమిషాలు ఇక్కడే ఉంటా.. ఆధారాలు తీసుకురా.. ఇక్కడి నుంచి డైరెక్టుగా రాజ్‌భవన్‌కి వెళ్లి రాజీనామా చేస్తా’ అని కేసీఆర్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. ‘కేసీఆర్ జగమొండి, మీలా తోకలు ముడవలే. తెలంగాణ కోసం త్యాగాలు, రాజీనామాలు చేసిన పార్టీ టీఆర్ఎస్. ఆరు నూరైనా సరే తెలంగాణ రైతులకు నీరందిస్తాం. కాంగ్రెస్‌కి తెలివి లేదు. ఆలోచన లేదు. ఏవేవో వాగుతోంది. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ గోసకు కారణం కాంగ్రెసే కారణం. ఒప్పందం వల్ల ఉపయోగం లేకపోతే నేను రాజీనామా చేస్తా. ఒప్పందం చేసుకోవడంతో నా గుండెల నిండా ఎంతో సంతోషంగా ఉంది’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్‌కి కనపడడం లేదు. ఈరోజు తెలంగాణకి పండుగ. తెలంగాణ తెస్తా అని ఆనాడు చెప్పాను, తెచ్చాను. కోటి ఎకరాలకు నీరందిస్తానని చెబుతున్నా, తెచ్చి తీరుతా. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అడ్డువచ్చినా వెనక్కి తగ్గను అని అన్నారు. త్వరలోనే బస్సు యాత్ర ద్వారా ప్రతి జిల్లాకు వస్తా. ప్రజల కష్టాలు తెలుసుకుంటా’ అని కేసీఆర్ ఉద్వేగంగా అన్నారు.