: హైదరాబాద్‌లో అదృశ్యమైన నలుగురు స్కూల్ విద్యార్థుల ఆచూకీ లభ్యం.. మారుతి కారులో గోవా వెళ్లిన వైనం!
హైదరాబాద్‌లోని ఉప్పల్ కేంద్రీయ విద్యాలయం విద్యార్థుల ఆచూకీ పోలీసులకు లభ్యమైంది. నిన్న సాయంత్రం నలుగురు విద్యార్థులు ఒకేసారి అదృశ్యం కావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న సాయినాథ్‌రెడ్డి, లికిత్‌కుమార్, విజయ్‌కుమార్, సాయికుమార్ పాఠశాల అయిపోగానే నిన్న సాయంత్రం వారి ఇళ్లకు వెళ్లి ఆ తరువాత కనిపించకుండా పోయారు. అయితే వారు ప్రస్తుతం మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థుల వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు వారి కదలికలను కనిపెట్టారు. మరోవైపు నలుగురు విద్యార్థులు మారుతి కారులో తమకు చెప్పకుండా వెళ్లారని విద్యార్థి సాయినాథ్‌రెడ్డి తండ్రి పోలీసులకి తెలిపారు. విద్యార్థులు గోవా వెళ్లాలని మాట్లాడుకున్నట్లు పాఠశాలలో వారి సహ విద్యార్థులు పోలీసులకి చెప్పారు. విద్యార్థి విజయ్‌కుమార్ తన ఇంట్లో నుంచి నాలుగు వేల రూపాయలు, నగలు తీసుకెళ్లినట్లు కూడా పోలీసులకు తెలిసింది.