: జర్మనీ క్లబ్‌లో శిక్షణకు 11 ఏళ్ల భారత్ 'సాకర్ సంచలనం'
ప్రపంచ ప్రఖ్యాత జర్మనీ క్లబ్ బేయర్న్ మ్యూనిచ్‌లో శిక్షణకు ఎంపికైన ఒడిశాకు చెందిన 11 ఏళ్ల సాకర్ సంచలనం చందన్ నాయక్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. బాలుడు జర్మనీ వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తిచేసింది. పేద కుటుంబానికి చెందిన చందన్ చిన్నప్పుడే తండ్రి కుటుంబాన్ని విడిచి వెళ్లిపోయాడు. పుట్టిన రోజు ధ్రువపత్రాలు సహా ఇతర డాక్యుమెంట్లు ఏవీ లేకపోవడంతో జర్మనీ క్లబ్‌కు ఎంపికైనా పాస్‌పోర్టు, వీసాకోసం ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో జోక్యం చేసుకున్న భువనేశ్వర్ మేయర్ అనంత నారాయణ్ జెనా అన్ని ధ్రువపత్రాలను సమకూర్చి పాస్‌పోర్టు, వీసాలను దగ్గరుండి ఏర్పాటు చేశారు. దీంతో చందన్ గురువారం జర్మనీ బయలు దేరనున్నాడు. సబర్ సాహి అనే మురికివాడలో పుట్టిన చందన్ ఇటీవల పుణెలో నిర్వహించిన ఆల్ ఇండియా కాంపిటిషన్‌లో పాల్గొని బేయర్న్ మ్యూనిచ్ క్లబ్‌లో శిక్షణకు అర్హత సాధించాడు. ‘‘ఓ రోజు చందన్ కలింగ స్టేడియానికి వచ్చి ఫుట్‌బాల్ క్రీడాకారులు తీసుకుంటున్న శిక్షణను గమనించాడు. సాయంత్రం క్రీడాకారులు వెళ్లిపోయాక స్టేడియంలోకి వెళ్లి అక్కడున్న ఫుట్‌బాల్‌తో ఆడడం మొదలుపెట్టాడు. ప్రముఖ దిగ్గజ క్రీడాకారులైన లియోనల్ మెస్సీ, మారడోనా తదితరులు ఉపయోగించే టెక్నిక్‌లను అతడిలో చూసి ఆశ్చర్యపోయా. దీంతో అతడిని మంచి క్రీడాకారుడిగా తయారుచేయాలని భావించి శిక్షణ ఇస్తున్నా’’ అని చందన్ కోచ్ జయదేవ్ మొహాపాత్రా పేర్కొన్నారు. మురికివాడలోని ఓ పక్క చిన్న గుడిసెలో తల్లితో కలిసి చందన్ నివసిస్తున్నాడు. తల్లి దుహితా నాయక్ ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. సాకర్‌లో చిన్న వయసులోనే అద్భుత ప్రతిభ కనబరుస్తున్న చందన్ ప్రతిభకు పేదరికం, వయసు అడ్డుకాదని నిరూపించాడు. నిజానికి బేయర్న్ మ్యూనిచ్‌లో శిక్షణకు 14-16 ఏళ్ల వయసు వారినే అనుమతిస్తారు. కానీ చందన్‌లోని అసాధారణ ప్రతిభ చూసిన అధికారులు అతడిని జర్మనీ పంపేందుకు నిర్ణయించారు. రెండు నెలలపాటు చందన్ అక్కడ శిక్షణ పొందుతాడు. ‘‘ఏదో ఒక రోజు భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలన్నదే నా కల. కోచ్, తల్లి నా వెంట ఉండి నన్ను అనుక్షణం ప్రోత్సహించారు. వారి ఆశలు నిజం చేస్తా’’ అని చందన్ చెప్పుకొచ్చాడు. 1902లో బేయర్న్ మ్యూనిచ్‌ను స్థాపించారు. ప్రముఖ యూరోపియన్ క్రీడాకారుల్లో చాలామంది ఇక్కడ శిక్షణ తీసుకున్నవారే.