: మహారాష్ట్రతో తెలంగాణ చారిత్రక ఒప్పందాలు
ముంబయిలోని సహ్యాద్రి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన గోదావరి అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పాల్గొన్నారు. వారితో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులు, ఇంజనీర్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మిడిహట్టి, మేడిగడ్డ ఆనకట్టల ఎత్తుపై ఇరురాష్ట్రాల మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో అధికారులు వాటికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ... మహారాష్ట్ర సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రతో తెలంగాణకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ ఒప్పందంపై సంతకాలు సువర్ణాక్షరాలతో లిఖించదగినవని అన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో ఇరు రాష్ట్రాల నడుమ సంబంధాలు బలోపేతమవుతున్నాయని వ్యాఖ్యానించారు. అనంతరం సీఎం ఫడ్నవిస్ ను శాలువాతో సత్కరించిన కేసీఆర్.. ఆయనకు చార్మినార్ మెమెంటోను ప్రదానం చేశారు.